General

కోకాపేట్ వేలం సూపర్ హిట్

కోకాపేట్ వేలం సూపర్ హిట్
    • 49.94 ఎకరాలకు వేలం పాట
    • ప్రభుత్వ ఖజానాకు రూ.2000.37 కోట్లు
    • గోల్డెన్ మైల్ ప్లాటు ఎకరాకు రూ.60.2 కోట్లు
    • ఈ ప్లాటుకే అత్యధిక ధర పెట్టిన రాజపుష్ప
    • రెండు ప్లాట్లను దక్కించుకున్న ఆక్వా స్పేస్ డెవలపర్స్
కోకాపేట్ వేలం ( Kokapet Land Auction ) పాటకు అపూర్వ ఆదరణ లభించింది. హెచ్ఎండీఏ మొత్తం 49.94 ఎకరాల స్థలానికి వేలం పాటల్ని నిర్వహించింది. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.2000.37 కోట్ల ఆదాయం లభించింది. నగరానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ రెండు ప్లాట్లను సొంతం చేసుకుంది. మై హోమ్ సంస్థ జూపల్లి రామేశ్వర్రావు కుమారుడు జూపల్లి శ్యామ్, జూపల్లి వినోద్ మరియు శ్రీనివాస రావు అరవపల్లి డైరెక్టర్లుగా ఉన్న ఆక్వా స్పేస్ డెవలపర్స్ సంస్థ రెండు ప్లాట్లను వేలంలో దక్కించుకుంది. గురువారం ఉదయం మొత్తం 30.77 ఎకరాల్ని వేలంలో విక్రయిస్తే.. ప్రభుత్వానికి సుమారు రూ.1,222.22 కోట్ల ఆదాయం లభించింది. ఇందులో మొదటి ప్లాటును ఎకరాకు రూ.42.2 కోట్లు పెట్టి సత్యనారాయణ రెడ్డి మన్నె అనే వ్యక్తి 7.721 ఎకరాల్ని దక్కించుకున్నారు. అంటే, తను మొత్తం రూ.325.83 కోట్లు వెచ్చించి ఈ స్థలాన్ని దక్కించుకున్నారు. నగరానికి చెందిన రాజపుష్ప ప్రాపర్టీస్ మరో 7.755 ఎకరాల స్థలాన్ని ఎకరాకు 42.4 కోట్లు చొప్పున రూ.328.81 కోట్లను పెట్టి సొంతం చేసుకుంది. మూడో ప్లాటు విస్తీర్ణం 7.738 ఎకరాలు కాగా.. ఆక్వా స్పేస్ డెవలపర్స్ అనే సంస్థ ఎకరాకు రూ.36.4 కోట్లు చొప్పున రూ.281.66 కోట్లు పెట్టి స్థలాన్ని దక్కించుకుంది. మరో 7.564 ఎకరాల భూమిని బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఎకరాకు రూ.37.8 కోట్ల చొప్పున రూ.285.92 పెట్టి స్థలాన్ని దక్కించుకుంది.
ఇక, రెండో సెషన్ లో వేలం పాట రసవత్తరంగా సాగింది. 8.94 ఎకరాల స్థలాన్ని ఆక్వా స్పేస్ డెవలపర్స్ సొంతం చేసుకుంది. ఎకరాకు రూ.39.2 కోట్లు చొప్పున ఈ స్థలాన్ని దక్కించుకుంది. ఇందుకు గాను మొత్తం రూ.350.68 కోట్లను వెచ్చించింది. 7.57 ఎకరాల స్థలాన్ని వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సంస్థ కైవసం చేసుకుంది. ఎకరాకు రూ.39.2 ఎకరాల చొప్పున మొత్తం రూ.296.94 కోట్లను వెచ్చించింది. హైమా డెవలపర్స్ సంస్థ ఎకరం ప్లాటుకు రూ.31.2 కోట్లు పెట్టగా.. మరో 1.65 ఎకరాల ప్లాటుకు రాజపుష్ప రియాల్టీ ఎల్ఎల్పీ రూ.60.2 కోట్లు ఎకరా చొప్పున పెట్టి మొత్తం రూ.99.33 కోట్లు వెచ్చించింది. దీంతో, రెండో సెషన్లో రూ.778.15 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది.

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available