కరోనా సెకండ్ వేవ్ భయమింకా తొలగిపోలేదు. కొవిడ్ వల్ల దేశమంతటా రోజూ సుమారు పదిహేను వందల మందికి పైగా మృత్యుపాలౌతున్నారు. మార్చి నుంచి కొవిడ్ 19 తీవ్రరూపలం దాల్చడంతో నిర్మాణ రంగమూ కకావికలైంది. ఎక్కడికక్కడ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. మరో నెల రోజుల్లోపు పరిస్థితిలో మార్పు వస్తుందన్న నమ్మకం లేదు. నిర్మాణ రంగం కోలుకోవడానికి ఐదారు నెలలు పడుతుందని నిపుణులు అంటున్నారు. మరి, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం కోకాపేట్ లో భూముల వేలం పాటల్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఎవరైనా ముందుకొచ్చి వీటిని కొంటే రికార్డే. కాకపోతే, దేశీయ డెవలపర్లు, అంతర్జాతీయ సంస్థలు వేలం పాటలో పాల్గొంటాయా?
కోకాపేట్ హాట్ లొకేషనే. భవిష్యత్తులో గణనీయంగా వృద్ధి చెందుతుంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో హెచ్ఎండీఏ వేలం పాటల్లో పాల్గొనేదెవరు అనేదే చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో నిర్మాణ రంగం దారుణంగా దెబ్బతిన్నదని ఇటవల క్రెడాయ్ నేషనల్ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. దాదాపు పది వేలకు పైగా బిల్డర్లు సెకండ్ వేవ్ లో దారుణంగా దెబ్బతిన్నారు. సకాలంలో రుణాలు రాక.. అమ్మకాల్లేక.. నిర్మాణ పనులు ముందుకెళ్లక.. నిర్మాణ సామగ్రి రేట్లు, కార్మికుల ఖర్చు పెరిగి.. ఫ్లాట్లు కొన్నవారు సకాలంలో సొమ్ము చెల్లించక నిర్మాణ రంగం దారుణంగా నష్టపోయింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కోకాపేట్లో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన భూముల విక్రయంలో పాల్గొనేదెవరు? వాటిని కొనేదెవరు? కేంద్రం ఆపన్నహస్తం అందిస్తుందని నిర్మాణ సంస్తలన్నీ ఆశగా చూస్తున్నాయి. మరి, వీరు కోకాపేట్ వేలం పాటలో పాల్గొనే అవకాశమే లేదని చెప్పొచ్చు. ఎవరైనా ధైర్యం చేస్తే సంతోషమే.
కింగ్ జాన్సన్ కొయ్యడ
కోర్టుల చుట్టూ జాతీయ బిల్డర్లు..
గతంలో వైఎస్సార్ ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటల్లో పాల్గొన్న జాతీయ బిల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగారు. ప్రభుత్వమే వేలం పాటల్ని నిర్వహించినప్పుడు.. వాటిని కొంటే ఇబ్బందులొస్తాయని ఏ సంస్థలూ భావించవు కదా.. కానీ, గోల్డన్ మైల్ వేలం పాటల్లో భూముల్ని కొన్న తర్వాత వివాదం ఏర్పడటంతో.. అప్పటి నుంచి జాతీయ స్థాయిలోని బడా నిర్మాణ సంస్థలు హైదరాబాద్లోకి అడుగు పెట్టేందుకు సంశయిస్తున్నాయి. మరి, ఆయా సంస్థలకు ఆత్మవిశ్వాసం కల్పించేదెలా? ఈ బాధ్యతను ఎవరు తీసుకుంటారు?కోకాపేట్ లో వివాదాల్లేని భూమి..
తెలంగాణ ప్రభుత్వం కోకాపేట్లో రహదారుల్ని అభివృద్ధి చేస్తోంది. మరికొన్ని చోట్ల రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో కొన్నవారికి ఎప్పటికీ అపరిమిత ఎఫ్ఎస్ఐ ని ప్రకటించింది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా పటిష్ఠమైన చర్యల్ని తీసుకుంది. కాకపోతే, ఇప్పటికే గోల్డన్ మైల్ లో భూముల్ని కొన్నవారు పూర్తి స్థాయిలో నిర్మాణాల్ని ఆరంభించనేలేదు. మాగ్నస్, మై హోమ్ వంటి సంస్థలు ఈమధ్యకాలంలో భూమిని చదును చేస్తున్నాయి. గార్ సంస్థ అక్కడే దాదాపు 50 మిలియన్ చదరపు అడుగుల్లో అభివృద్ధి చేయనుంది. గతంలో కొన్నవారిలో కొందరే ప్రస్తుతం అక్కడ నిర్మాణాల్ని ఆరంభిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కోకాపేట్‌లో తమ కార్యాలయాల్ని ఆరంభించాలని భావిస్తే.. ఇప్పటికే భూముల్ని కొన్న కంపెనీల వద్ద తక్కువ రేటుకే తీసుకోవచ్చు కదా.. ప్రభుత్వం నిర్వహించే వేలం పాటల్లో పాల్గొనడం ఎందుకు?ఎకరానికి కనీస ధర.. రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్వహించింది. ఆపై ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారికి భూమిని ప్రభుత్వం బదలాయిస్తుంది. ఒక్కో స్థలం దాదాపు ఏడు ఎకరాలు పైగా ఉంది. అంటే, ఎకరానికి రూ.40 కోట్లు పలికినా.. ఏడున్నర ఎకరాలకు రూ.300 కోట్లు పెట్టాల్సి ఉంటుంది. మరి, ఇంతింత సొమ్ము పెట్టే డెవలపర్లు మన వద్ద మహా అయితే రెండు డజన్ల మంది దాకా ఉండొచ్చు. కానీ, వారంతా ఇప్పటికే పలు ప్రాజెక్టుల్ని చేపడుతున్నారు. మళ్లీ, ఇంతింత సొమ్ము పెట్టి భూమిని కొంటారా? ఆలోచించాల్సిన విషయమే.
గత రెండు, మూడేళ్ల నుంచి 95 శాతం మంది డెవలపర్లు యూడీఎస్ స్కీములో ఫ్లాట్లను విక్రయించారు. ఇందులో బడా నిర్మాణ సంస్థలూ ఉన్నాయి. వీటికి అదనంగా సంప్రదాయ బిల్డర్లూ ఎక్కువే కట్టడాల్ని చేపడుతున్నారు. హైదరాబాద్ మొత్తం దాదాపు లక్ష ఫ్లాట్ల కంటే ఎక్కువ నిర్మాణంలో ఉన్నాయి. ఏడాదికి మహా అయితే పాతిక వేలు అమ్ముడవుతాయి. ఇది కాకుండా, సుమారు పది కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ నిర్మాణ దశలో ఉంది. నివాస, వాణిజ్య సముదాయాల్లో ఇప్పటికే గిరాకీ కంటే సరఫరా ఎక్కువున్నప్పుడు.. కొత్తగా కోకాపేట్‌లో స్థలాన్ని కొని నిర్మాణాల్ని చేపట్టాలని స్థానిక బిల్డర్లు ఎందుకు ప్రయత్నిస్తారు? పైగా, ఎక్కువ శాతం జాయింట్ డెవలప్‌మెంట్ మీదే ఫోకస్ పెడుతున్న విషయం మర్చిపోవద్దు.
ఎవరు కొంటారు?
కోకాపేట్‌లో వేలం పాటలో భూముల్ని విక్రయించేందుకు ప్రభుత్వం నిర్మాణ సంస్థల మీద దృష్టి పెట్టకుండా.. ఆర్థిక సంస్థలు, ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఫండ్ల మీద దృష్టి పెట్టాలి. అప్పుడే, ఈ వేలానికి ఆదరణ లభిస్తుంది. రెండు చిన్న ప్లాట్లకైతే చాలామంది పోటీపడే అవకాశముంది.- హెచ్ఎండీఏ కోకాపేట్లో ఏడు ప్లాట్లను వేలం వేస్తోంది. వీటి విస్తీర్ణం సుమారు 48.27 ఎకరాలు. ఒక ప్లాటు మాత్రమే ఎకరంలో ఉంది. మిగతావన్నీ ఏడు ఎకరాలపైమాటే.
- గోల్డన్ మైల్లో మిగిలిపోయిన 1.65 ఎకరాల చిన్న ప్లాటునూ వేలం వేస్తోంది.
- రిజిస్ట్రేషన్ చివరి తేది: జులై 13
- ఈఎండీకి ఆఖరు గడువు: జులై 14
- ఈ-వేలం తేది: 2021 జులై 15
ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని regnews21@gmail.com కి తెలియజేయండి.
Neopolis Kokapet - PROJECT INFORMATION DOSSIER