General

నియోపోలిస్ కాంక్రీటు జంగిల్లేనా పార్కుల్ని అభివృద్ధి చేయ‌రా?

నియోపోలిస్ కాంక్రీటు జంగిల్లేనా పార్కుల్ని అభివృద్ధి చేయ‌రా?
  • అభివృద్ధి అంటే కాంక్రీటు నిర్మాణాలేనా..
  • 530 ఎక‌రాల్ని వేలంలో అమ్మేస్తారా..
  • ప్ర‌జ‌ల కోసం పార్కుల్ని ఏర్పాటు చేయ‌రా?
  • సేద తీర‌డానికి ఉద్యాన‌వ‌నాలు వ‌ద్దా? 
  • ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాలి..
విదేశీ న‌గ‌రాల త‌ర‌హాలో.. సుమారు 530 ఎక‌రాల్లో.. నియోపోలిస్‌ల‌ను అభివృద్ధి చేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆరంభం నుంచి ప్ర‌ణాళిక‌ల్ని ర‌చించాయి. 2007లో అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం కోకాపేట్లో భూముల్ని వేలం వేసిన‌ప్పుడు ఎక‌రాకు రూ.14 కోట్లు ప‌లికింది. అదే 2021 నాటికి ఎక‌రాకు రూ.60 కోట్లు.. త‌ర్వాత రూ.100 కోట్లు ప‌లికింది. ఇటీవ‌ల కాలంలో నిర్వ‌హించిన వేలం పాట‌కు రూ.150 కోట్లుపైగా ఎక‌రా ధ‌ర ప‌లికింది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. మ‌రి, నియోపోలిస్ మొత్తం కాంక్రీటుమ‌యం చేసేస్తారా? భ‌విష్య‌త్తులో ప్ర‌జా అవ‌స‌రాల నిమిత్తం ఉద్యాన‌వ‌నాల్ని అభివృద్ధి చేయ‌రా? ఇలాగైతే, ఇక్క‌డ నివ‌సించే భ‌విష్య‌త్తు త‌రాల‌కు ఏం స‌మాధానం చెబుతాం? వారికి స్వ‌చ్ఛ‌మైన గాలి, పార్కుల్ని అందజేయాల్సిన బాధ్య‌త ప్ర‌స్తుత పాల‌కుల మీద లేదా? 
 
నియోపోలిస్‌లో ఎత్త‌యిన ఆకాశ‌హ‌ర్మాల్ని ఇప్ప‌టికే వివిధ నిర్మాణ సంస్థ‌లు చేప‌డుతున్నాయి. న్యూయార్క్ త‌ర‌హాలో నియోపోలిస్ కూడా దేదీప్య‌మానంగా వెలిగిపోతుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. కాక‌పోతే, 530 ఎక‌రాల్లో ఇందులో నివ‌సించే ప్ర‌జ‌లు ఉద‌యం, సాయంత్రం సేద‌తీర‌డానికి ఉద్యాన‌వ‌నాలు ఎక్క‌డున్నాయి? వీటి కోసం ప్ర‌జ‌లు ఎక్క‌డికి వెళ్లాల్సి ఉంటుంది? ఇన్నిన్ని ఆకాశ‌హ‌ర్మ్యాల మ‌ధ్య‌లో ప్ర‌భుత్వం పార్కుల‌ను ఎందుకు అభివృద్ధి చేయ‌డం లేదు? ప్ర‌తి అంగుళాన్ని వేలం పాట‌లో అమ్ముకుంటూ పోతారా? ఇదేవిధంగా జ‌రిగితే.. ఓ ఐదేళ్ల త‌ర్వాత ఈ ప్రాంత‌మంతా కాంక్రీటు నిర్మాణాల‌తో నిండిపోవాల్సిందేనా?
నియోపోలిస్‌లో ఒక్క పార్కు కూడా లేక‌పోతే.. అక్క‌డి ప్ర‌జ‌లు స‌ర‌దాగా క‌లుసుకుని ఎక్క‌డ క‌బుర్లు చెప్పుకుంటారు? ఎక్క‌డ ప్ర‌శాంతంగా గ‌డుపుతారు? నియోపోలిస్ అంటే మొత్తం కాంక్రీటు నిర్మాణాలు ఉండాల్సిందేనా? ప‌చ్చ‌ద‌నం కోసం కాస్త అయినా స్థ‌లం వ‌దిలిపెట్ట‌రా? 
 
క‌నీసం ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా.. నియోపోలిస్‌లో ప‌చ్చ‌ద‌నాన్ని అభివృద్ధి చేయాలి. ఇందుకోసం పార్కుల్ని అభివృద్ధి చేయాలి. నియోపోలిస్ లేఅవుట్లో ప్ర‌జా అవ‌స‌రాల నిమిత్తం కొంత స్థ‌లాల్ని కేటాయించాలి. పార్కుల్ని వృద్ధి చేయాలి. లేక‌పోతే, నియోపోలిస్ ఒక కాంక్రీట్ జంగిల్లా మారిపోతుంద‌నే విష‌యంలో ఎలాంటి సందేహం లేదు.