General

రెరా నిబంధనల నుంచి మినహాంపు ఇవ్వండి

రెరా నిబంధనల నుంచి మినహాంపు ఇవ్వండి
  • నిలిచినపోయిన సూపర్ టెక్ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులపై ఎన్‌బీసీసీ పిటిషన్

రుణ సంక్షోభంతో నిలిచిపోయిన సూపర్‌టెక్‌కు చెందిన 16 గృహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ఎన్‌బీసీసీ (ఎన్ బీసీసీ) రెరా నిబంధనల నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, సూపర్‌టెక్‌ మాజీ డైరెక్టర్‌ రామ్‌ కిషోర్‌ అరోరాకు నోటీసులు జారీ చేసింది. కేసును సెప్టెంబర్‌ 24న విచారించనుంది.

16 ప్రాజెక్టుల్లో నిర్మాణం కొనసాగించేందుకు నిధులను ఒక ప్రాజెక్టు నుంచి అవసరమున్న మరో ప్రాజెక్టుకు మళ్లించాల్సిన పరిస్థితి ఉందని ఎన్‌బీసీసీ చెబుతోంది. అయితే రెరా నిబంధనల ప్రకారం ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించడంతో పాటు, కొనుగోలుదారుల నుంచి వసూలైన మొత్తంలో 70 శాతాన్ని ఆ ఖాతాలోనే జమ చేయాలి. ఈ నిబంధనల వల్ల నిధులను అవసరమైన ప్రాజెక్టులకు మళ్లించడం కష్టమవుతోందని ఎన్‌బీసీసీ వాదిస్తోంది.

అలాగే ప్రాజెక్టుల హక్కులు, బాధ్యతల బదిలీకి సంబంధించి కొనుగోలుదారుల అనుమతుల విషయంలోనూ వెసులుబాటు కోరింది. అయితే మే 22న ఎన్‌సీఎల్‌ఏటీ రెరా చట్టంలోని తప్పనిసరి నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. దీంతో ఎన్‌బీసీసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సూపర్‌టెక్‌ ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయింది.

2021లో సంస్థపై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. అనంతరం ఈ 16 ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతను ఎన్‌బీసీసీకి అప్పగించే ప్రక్రియ మొదలైంది. సుమారు 50 వేల ఇళ్లతో కూడిన ఈ ప్రాజెక్టుల్లో దాదాపు 27 వేల మంది కొనుగోలుదారులు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు వివరాలు చెబుతున్నాయి. నోయిడా, గ్రేటర్‌ నోయిడా, గురుగ్రామ్‌, మీరట్‌, రుద్రపూర్‌, డెహ్రాడూన్‌, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి.

పెండింగ్‌లో ఉన్న విక్రయించిన ఇళ్లను పూర్తి చేసేందుకు సుమారు రూ.1,700 కోట్ల పెట్టుబడి అవసరమని అంచనా. అదే సమయంలో కొనుగోలుదారుల నుంచి ఇంకా సుమారు రూ.2,200 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధులను సమర్థంగా వినియోగించేందుకు రేరా నిబంధనల్లో కొంత వెసులుబాటు అవసరమని ఎన్‌బీసీసీ భావిస్తోంది.రెరా నిబంధనల్లో వెసులుబాటు లభిస్తే నిధుల వినియోగం సులభమై, ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది కొనుగోలుదారులకు ఊరట లభించే అవకాశం ఉంది.