General

కొడంగ‌ల్ గ్రోత్ స్టోరీ 

కొడంగ‌ల్ గ్రోత్ స్టోరీ 

కొడంగల్‌.. ఇప్పుడు కేవలం రాజకీయంగానే కాదు.. రియల్‌ ఎస్టేట్‌ పరంగానూ హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఇన్నాళ్లూ వ్యవసాయ ప్రాంతంగా కనిపించిన కొడంగల్‌ చుట్టుపక్కల.. ఇప్పుడు ఎడ్యుకేషన్‌, ఇండస్ట్రీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనే మూడు గ్రోత్‌ ఇంజిన్లు పరుగులు పెట్టబోతున్నాయి. ముఖ్యంగా దుద్యాల మండలం హకీంపేటలో 248 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న భారీ ఎడ్యుకేషన్‌ హబ్‌.. ఈ ప్రాంత రియల్‌ ఎస్టేట్‌కు కొత్త ట్రిగ్గర్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. విద్యా సంస్థలు వస్తే విద్యార్థులు వస్తారు.. ఉద్యోగాలు పెరుగుతాయి.. అద్దె ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతుంది.. దాంతో చుట్టుపక్కల భూములు, ప్లాట్లపై ఆసక్తి పెరగడం సహజం. మరి కొడంగల్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌లో కొత్త గ్రోత్‌ స్టోరీ మొదలైందా?

హకీంపేటలో 248 ఎకరాల ఎడ్యుకేషన్‌ హబ్‌
భారీగా విద్యా సంస్థల ఏర్పాటు
మెడికల్‌.. ఇంజనీరింగ్‌.. నార్సింగ్‌.. వెటర్నరీ
2 వేల మంది విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌

ఎడ్యుకేషన్‌ హబ్‌తో పెరగనున్న రాకపోకలు
అద్దె ఇళ్లు.. హాస్టళ్లు.. కమర్షియల్‌ డిమాండ్‌
ప్లాట్లు.. విల్లాలు.. గేటెడ్‌ కమ్యూనిటీలకు అవకాశాలు
ఎడ్యుకేషన్‌ + ఇండస్ట్రీ = కొత్త గ్రోత్‌ కారిడార్‌

రోడ్డు.. రైల్వే కనెక్టివిటీపై ఫోకస్‌
కొడంగల్‌ రియల్‌ ఎస్టేట్‌పై ఇన్వెస్టర్ల ఆసక్తి


హకీంపేటలోని 248 ఎకరాల్లో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్‌ హబ్‌.. కొడంగల్‌ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది. మెడికల్‌, నార్సింగ్‌, పారా మెడికల్‌, ఇంజనీరింగ్‌, వెటర్నరీ వంటి విద్యా సంస్థలతో పాటు ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తున్నారు. దశలవారీగా ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఏర్పడితే.. దాని చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ డిమాండ్‌ పెరగడం సాధారణం. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కోసం హాస్టళ్లు, పీజీలు, అద్దె ఇళ్లు అవసరమవుతాయి.

దాంతో రెసిడెన్షియల్‌ ప్లాట్లు, చిన్న అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ స్పేస్‌లకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మరో కీలక అంశం.. ఎడ్యుకేషన్‌ హబ్‌కు తోడుగా పారిశ్రామిక అభివృద్ధి కూడా. కొడంగల్‌ చుట్టుపక్కల పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగితే.. స్థానికంగా నివాస అవసరాలు మరింత పెరుగుతాయి. అంటే విద్యా సంస్థలు ఒక వైపు.. పరిశ్రమలు మరోవైపు.. వీటికి అవసరమైన నివాస, వాణిజ్య మౌలిక వసతులు మధ్యలో.. ఇలా ఒక కొత్త ఎడ్యుకేషన్‌–ఇండస్ట్రీ గ్రోత్‌ కారిడార్‌ ఏర్పడే అవకాశం ఉంది.

రియల్‌ ఎస్టేట్‌ పరంగా చూస్తే.. కొడంగల్‌, దుద్యాల, దౌల్తాబాద్‌, పరిగి, కోస్గి వైపు ఉన్న ప్రాంతాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు, విద్యా సంస్థలకు సమీపంలోని భూములు, భవిష్యత్‌ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు డిమాండ్‌ పెరిగే ఛాన్స్‌ ఉంది. అయితే ఎడ్యుకేషన్‌ హబ్‌ వచ్చిందనే కారణంతో ప్రతి భూమి ధర ఒక్కసారిగా పెరుగుతుందని చెప్పలేం.

రోడ్డు కనెక్టివిటీ, భూమి టైటిల్‌, లేఅవుట్‌ అనుమతులు, ప్రభుత్వ జోనింగ్‌, విద్యా సంస్థలకు దూరం వంటి అంశాలే భవిష్యత్‌ విలువను నిర్ణయించనున్నాయి. అందుకే కేవలం భవిష్యత్‌ అంచనాలతో కాకుండా.. చట్టబద్ధమైన అనుమతులు ఉన్న ప్రాపర్టీలనే పరిశీలించాల్సి ఉంటుంది. మరోవైపు కొడంగల్‌ వైపు రోడ్డు, రైల్వే కనెక్టివిటీ మెరుగుపడితే ఈ ప్రాంతానికి మరింత బలం చేకూరనుంది. హైదరాబాద్‌కు ప్రత్యక్షంగా, వేగంగా చేరుకునే మార్గాలు మెరుగైతే.. నగరానికి దూరంగా తక్కువ ధరల్లో ప్రాపర్టీ కోసం చూస్తున్న వారి దృష్టి కూడా ఈ వైపు మళ్లే అవకాశం ఉంది.