- అమ్మడానికి పట్టే సమయం.. 41 నెలలు
- ప్రాప్ టైగర్ తాజా సర్వే వెల్లడి
- 8 నగరాల్లో 8 లక్షల అమ్ముడుపోని ఇళ్లు
దేశవ్యాప్తంగా అమ్ముడుపోని ఇళ్ల సంఖ్యం పెరుగుతోంది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ప్రస్తుతం 7.85 లక్షల అమ్ముడుపోని ఇళ్లు ఉన్నాయి. ప్రస్తుత అమ్మకాల వేగంతో వీటిని అమ్మాలంటే కనీసం 32 నెలల సమయం పడుతుందని అంచనా. అదే ఢిల్లీ రెసిడెన్షియల్ మార్కెట్ పై ఆమ్రపాలి, జేపీ ఇన్ ఫ్రాటెక్, యూనిటెక్ వంటి పెద్ద బిల్డర్లు డీఫాల్టుల వల్ల ప్రతికూల ప్రభావం భారీగా పడింది. దీంతో అక్కడ ఉన్న లక్షకు పైగా అమ్ముడుపోని ఇళ్లను అమ్మడానికి కనీసం 62 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కమ్ వెల్లడించిన వివరాల ప్రకారం 2022 సెప్టెంబర్ 30 నాటికి అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 7,63,650 నుంచి 7,85,260కి పెరిగింది.
అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్ కతా, ముంబై, పుణెల్లో ఈ ఇళ్లున్నాయి. ఈ ఎనిమిది నగరాల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ లలో ఇళ్ల అమ్మకాలు 49 శాతం పెరిగాయి. గతేడాది ఇదే కాలంలో 55,910 ఇళ్లు అమ్ముడవగా.. ఈసారి ఆ సంఖ్య 83,220కి చేరింది. హౌసింగ్ డిమాండ్ లో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, ఇన్వెంటరీ ఓవర్ హాంగ్ లో కూడా అదే స్థాయిలో క్షీణత ఉందని నివేదిక పేర్కొంది.
బిల్డర్లు తమ అమ్ముడుపోని స్టాక్ ను ప్రస్తుతం ఉన్న విక్రయాల వేగంతో అమ్మితే 32 నెలల సమయం పడుతుందని అంచనా వేసింది. కోల్ కతాలతో అత్యల్పంగా 24 నెలలు ఉండగా.. ఢిల్లీలో 62 నెలలుగా ఉంది. ఈ ఎనిమిది నగరాల్లో అమ్ముడుపోని ఇన్వెంటరీలో దాదాపు 21 శాతం రెడీ టూ మూవ్ కేటగిరీకి చెందినవే. నివేదిక ప్రకారం చూస్తే.. అహ్మదాబాద్ లో సెప్టెంబర్ త్రైమాసికం చివరి నాటికి 30 నెలల ఇన్వెంటరీ ఓవర్ హాంగ్ తో 65,160 అమ్ముడుపోని హౌసింగ్ యూనిట్లు ఉన్నాయి. బెంగళూరులో ప్రస్తుతం ఉన్న 77,260 ఇళ్లను అమ్మడానికి 28 నెలల సమయం పడుతుంది. చెన్నైలో 27 నెలల ఇన్వెంటర్ ఓవర్ హాంగ్ తో 32,180 అమ్ముడుపోని యూనిట్లు ఉన్నాయి. ఢిల్లీ విషయానికి వస్తే 1,00,770 అమ్ముడుపోని ఇళ్లను విక్రయించడానికి 62 నెలల సమయం పడుతుంది. హైదరాబాద్ లో 99,090 అమ్ముడుపోని ఇళ్లు ఉండగా.. వాటిని విక్రయించడానికి 41 నెలల సమయం పడుతుందని అంచనా.