బాచుపల్లిలో విద్యా సంస్థలకు కొదవే లేదు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి స్కూళ్లయిన సిల్వర్ ఓక్స్, కెనెడీ ఇంటర్నేషనల్, ఓక్రిడ్జ్, గ్యాంజెస్ వ్యాలీ, ద క్రీక్, సెంటియా వంటివి ఉన్నాయి. శ్రీ చైతన్య, ఎంఎన్ఆర్, నారాయణ, ఎన్ఆర్ఐ తదితర ఇంటర్మీడియట్ కళాశాలలున్నాయి. వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు రంగరాజు వంటి ఇంజినీరింగ్ కళాశాలలకు లెక్కే లేదు.
ఇక్కడ వ్యక్తిగత అపార్టుమెంట్లతో బాటు డ్యూప్లేలు, విల్లా ప్రాజెక్టులకు కొదవే లేదు. ఇక ప్లాట్ల విషయానికి వస్తే.. 160 గజాల నుంచి 200 గజాల మధ్యలో ఉన్నాయి. ఇక, ధరల విషయానికి వస్తే.. హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొందిన ఓ స్థాయి అపార్టుమెంట్లలో చదరపు అడుక్కీ రూ.5,000కి అటుఇటుగా చెబుతున్నారు. బడా గేటెడ్ కమ్యూనిటీ విల్లాలైతే రేటు కోటి రూపాయలు దాటేసింది.
గుర్తుంచుకోండి..
బాచుపల్లి, మల్లంపేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాలుండటం.. అందులోని పరిశ్రమల నుంచి వాయు కాలుష్యం విడుదల అవుతూనే ఉంటుంది. దీని వల్ల ఇక్కడ నివసించే ప్రజలకు రాత్రి కాగానే ఘాటైన వాసనలు ఇబ్బంది పెట్టే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి బాచుపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేవారు ఈ అంశాన్ని కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు కొనాలని అనుకున్న అపార్టుమెంట్ కానీ విల్లా చుట్టుపక్కల నివసించేవారిని ఈ కాలుష్యం గురించి విచారించాకే అడుగు ముందుకేయండి. ఎలాంటి సమస్య లేదని నిర్థారించుకున్నాకే తుది నిర్ణయానికి రండి. రాష్ట్రంలో ఎక్కడా లేనన్నీ ఫిర్యాదులు ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడల నుంచే వస్తున్నాయి. ఏడాదిలో కనీసం 500 దాకా ఫిర్యాదులొస్తాయి. వాయు కాలుష్య సమస్య నివారణకు సర్వే జరుగుతోందని పీసీబీ ఈఈ రవికుమార్ తెలిపారు.