- హైదరాబాద్ లో భారీగా ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న సీఐబీసీ
హైదరాబాద్ ఐటీ, ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ లీజు ఒప్పందం నమోదైంది. కెనడాకు చెందిన ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (సీఐబీసీ) నగరంలో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) కోసం సుమారు 1.21 లక్షల చదరపు అడుగుల మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకుంది. ఐదేళ్ల కాలానికి కుదిరిన ఈ ఒప్పందం విలువ మొత్తం సుమారు రూ.180 కోట్లుగా ఉంది. ఈ లీజు ఒప్పందం ప్రకారం ప్రారంభంలో సీఐబీసీ చెల్లించాల్సిన నెలవారీ అద్దె రూ.2.72 కోట్లు. అంటే చదరపు అడుగుకు సుమారు రూ.225 చొప్పున అద్దె వస్తోంది.
ఐదేళ్ల లీజు వ్యవధిలో ప్రతి ఏడాది అద్దెను 5 శాతం పెంచే నిబంధన ఉంది. దీంతో ఐదేళ్లలో సంస్థ చెల్లించే మొత్తం అద్దె వ్యయం సుమారు రూ.180 కోట్లకు చేరనుంది. ఇందుకోసం సీఐబీసీ రూ.16.30 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. భారీ స్థాయిలో ఆఫీస్ స్పేస్ అవసరమైనప్పటికీ, సంప్రదాయ పద్ధతిలో భవనాన్ని దీర్ఘకాలికంగా స్వయంగా ఏర్పాటు చేసుకోవడం కంటే మేనేజ్డ్ ఆఫీస్ విధానాన్ని ఎంచుకోవడం ఈ ఒప్పందంలో ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఈ కార్యాలయ స్థలం హైదరాబాద్‌లోని మీనాక్షి ఎకో పార్క్, టవర్–1లో ఉంది. రెండు అంతస్తుల్లో ఈ కార్యాలయ స్థలం విస్తరించి ఉంది. లీజు ఒప్పందంలో పేర్కొన్న ఛార్జబుల్ ఏరియా సుమారు 1.21 లక్షల చదరపు అడుగులు కాగా, బిల్ట్-అప్ ఏరియా సుమారు 95,352 చదరపు అడుగులుగా ఉంది. కార్యాలయానికి అనుబంధంగా 121 కార్ల పార్కింగ్ స్థలాలు కూడా కేటాయించారు.
ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంస్థలు తమ గ్లోబల్ కార్యకలాపాలకు భారత నగరాలను కీలక కేంద్రాలుగా ఎంచుకుంటున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి చెందిన సంస్థలు హైదరాబాద్, బెంగళూరు, పుణె, చెన్నై వంటి టెక్ హబ్‌లలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను విస్తరిస్తున్నాయి. సీఐబీసీ తాజా లీజు కూడా హైదరాబాద్‌లో జీసీసీల విస్తరణకు మరో ఉదాహరణగా నిలుస్తోంది.
హైదరాబాద్ మేనేజ్డ్ ఆఫీస్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో పలు భారీ లావాదేవీలు నమోదవుతున్నాయి. ఈ డిమాండ్ ఇలాగే కొనసాగితే ప్రధాన ఐటీ కారిడార్లలో ఆఫీస్ అద్దెలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గచ్చిబౌలి, రాయదుర్గ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, నానక్‌రామ్‌గూడ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే భారీ కార్పొరేట్ ఆఫీస్ కార్యకలాపాలు ఉన్నాయి. కొత్త జీసీసీల రాకతో ఈ ప్రాంతాల్లో కార్యాలయ స్థలాల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
