- కారు కొనడం కోసం ఫ్లాట్ వద్దనుకున్న బెంగళూరు వ్యక్తి విలాపం
- ఆరేళ్లలో మూడు రెట్లు పెరిగిన 1 బీహెచ్ కే ఫ్లాట్ ధర
- అప్పుడు కొనలేకపోయినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం
రియల్ ఎస్టేట్‌లో సరైన సమయంలో తీసుకునే నిర్ణయం ఎంత కీలకమో చెప్పే ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 2020లో రూ.30 లక్షలకు 1బీహెచ్‌కే ఫ్లాట్ కొనుగోలు చేసే అవకాశం వచ్చినా దాన్ని వదులుకుని కారు కొనుగోలు చేశాడు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అతడికి పశ్చాత్తాపాన్ని మిగిల్చింది. ఎందుకంటే అదే ప్రాంతంలో అలాంటి 1బీహెచ్‌కే ఫ్లాట్ల ధర ఇప్పుడు సుమారు రూ.90 లక్షలకు చేరిందని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
అంటే ఆరేళ్లలో ఆస్తి విలువ దాదాపు మూడు రెట్లు పెరిగినట్టన్నమాట. ఈ వ్యక్తి 2018లో బెంగళూరులోని చూడసంద్ర ప్రాంతానికి వెళ్లాడు. అప్పట్లో అతడు హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ ప్రాంతంలో పనిచేసేవాడు. కార్యాలయానికి దగ్గరగా ఉండటంతో పాటు అక్కడ అద్దెలు తక్కువగా ఉండటంతో చూడసంద్రలో నివసించేందుకు వెళ్లినట్లు సోషల్ మీడియాలో వివరించాడు. 2018 నుంచి 2020 వరకు అక్కడే నివసించాడు.
అతడు అద్దెకు ఉంటున్న 1బీహెచ్‌కే ఫ్లాట్ యజమాని బెంగళూరు నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ ఫ్లాట్‌ను సుమారు రూ.30 లక్షలకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అప్పటికి ఈ వ్యక్తి వయసు కేవలం 26 సంవత్సరాలు. ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా అతడికి వచ్చింది. కానీ చివరకు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇంటిపై పెట్టుబడి పెట్టడం కంటే ఓ కారు కొనుగోలు చేయడం మంచిదని భావించాడు. దీంతో రూ.30 లక్షల ఫ్లాట్ అవకాశాన్ని వదిలేశాడు.
ఆరేళ్ల తర్వాత తిరిగి అదే ప్రాంతానికి..
తాజాగా తన స్నేహితుడి ఇంట్లో జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లేందుకు అతడు మళ్లీ చూడసంద్ర ప్రాంతానికి వెళ్లాడు. అప్పటికి, ఇప్పటికి అక్కడ వచ్చిన మార్పును చూసి అతడు ఆశ్చర్యపోయాడు. తాను 2018లో చూసిన ప్రాంతానికి, ఇప్పుడు కనిపిస్తున్న చూడసంద్రకు అసలు పోలిక లేదని చెప్పాడు. “మినీ వైట్‌ఫీల్డ్‌లా మారిపోయింది” అని అభివర్ణించాడు. భారీ సంఖ్యలో భవనాలు, అపార్ట్‌మెంట్లు వెలిశాయని పేర్కొన్నాడు.
ప్రాంతం మారిపోయిందని గమనించిన అతడికి అసలు షాక్ మాత్రం అక్కడి ఫ్లాట్ ధరలు తెలుసుకున్న తర్వాత తగిలింది. తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో ప్రస్తుతం అదే ప్రాంతంలోని 1బీహెచ్‌కే ఫ్లాట్ల ధర సుమారు రూ.90 లక్షల వరకు ఉందని తెలుసుకున్నాడు. అంటే 2020లో రూ.30 లక్షలకు కొనుగోలు చేసి ఉంటే, ఆ ఫ్లాట్ విలువ ఇప్పుడు సుమారు రూ.90 లక్షలకు చేరేది. అంటే కేవలం ఆస్తి విలువ పెరుగుదల పరంగా చూస్తే దాదాపు రూ.60 లక్షల తేడా ఏర్పడింది.
2020లో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసుకున్న అతడు ఇప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని కొంతమంది ఫ్లాట్ యజమానులు తమ ఇళ్లను విక్రయించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అతడు పేర్కొన్నాడు. రెంటల్ ఇన్‌కమ్ కూడా బాగుండటంతో పాటు ఆస్తి విలువ ఇప్పటికే గణనీయంగా పెరగడంతో అమ్మకానికి ఎవరూ సుముఖత చూపడంలేదని తెలిపాడు. ఈ పోస్టు చదివిన నెటిజన్లలో కొందరు అతడిని ఓదార్చగా.. మరికొందరు తాము కూడా ఇలాంటి అవకాశాలు కోల్పోయినట్టు చెప్పారు. ఇక అప్పట్లో అతడు కొన్న కారు విలువ ప్రస్తుతం రూ.5 లక్షలుగా ఉందని చెప్పడం కొసమెరుపు.
