General

ఏఎస్‌బీఎల్ కొత్త ప్రాజెక్టు: నాణ్య‌త‌గా క‌డ‌తారా? గ్యారెంటీ ఏమిటీ?

ఏఎస్‌బీఎల్ కొత్త  ప్రాజెక్టు: నాణ్య‌త‌గా క‌డ‌తారా? గ్యారెంటీ ఏమిటీ?

టీజీ రెరా అనుమ‌తి రాక ముందే ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌డం.. ఆ త‌ర్వాత రెరా ప‌ర్మిష‌న్ తీసుకున్నాక.. ప్రాజెక్టు లాంచ్ అంటూ హ‌డావిడి చేయ‌డం.. లాంచింగ్ రోజే ఐదు వంద‌ల దాకా ఫ్లాట్ల‌ను అమ్మాం.. ఇన్ని కోట్ల విలువైన ఫ్లాట్ల‌ను విక్ర‌యించామ‌ని చెప్పుకోవ‌డమ‌నేది.. ఇటీవ‌ల కాలంలో కొన్ని నిర్మాణ సంస్థ‌ల‌కు ఫ్యాష‌న్‌గా మారింది.

అది నిజ‌మేన‌ని న‌మ్మి.. కొంద‌రు వెళ్లి..ఆయా ప్రాజెక్టులో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసి అడ్డంగా ఇరుక్కుపోతున్నారు. ఒక‌వేళ బిల్డ‌ర్ ఆయా ప్రాజెక్టును పూర్తి చేసిన‌ప్ప‌టికీ.. నాసిర‌క‌మైన ప‌నుల్ని బిల్డ‌ర్ చేయ‌డం వ‌ల్ల‌.. అందులోకి అడుగుపెట్టాక చాలా ఇబ్బందులు ప‌డుతారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏఎస్‌బీఎల్ సంస్థ శ‌నివారం ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ సంస్థ నాణ్య‌త‌గా క‌ట్ట‌ద‌నే విష‌యాన్ని తెలుసుకున్న కొంత‌మంది క‌స్ట‌మ‌ర్లు ఇందులో ఫ్లాట్ల‌ను కొన‌డానికి వెన‌క‌డుగు వేశారు. అందుకే, ఏఎస్‌బీఎల్ ఏం చేసిందంటే.. జీరో ఈఎంఐ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించి ఫ్లాట్ల‌ను విక్ర‌యించింది.

తాజాగా శ‌నివారం ఉద‌య‌మే విడుద‌ల చేసిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో.. లాంచ్ రోజే ఎనిమిది వంద‌ల కోట్ల విలువ గ‌ల ఫ్లాట్ల‌ను విక్ర‌యించామ‌ని ప్ర‌క‌టించింది. 

మార్కెటింగ్‌లో తెగ హ‌డావిడి చేసే ఏఎస్‌బీఎల్ సంస్థ చెప్పేది నిజ‌మేన‌ని కొంద‌రు బ‌య్య‌ర్లు తొలుత భావించారు. కానీ, పోచారంలో ఈ సంస్థ డెవ‌ల‌ప్ చేసిన గేటేడె క‌మ్యూనిటీని ఒక్క‌సారి చూడండి. నిర్మాణం పూర్త‌య్యాక అందులో కొన్న‌వారు ఎంత బాధ‌ప‌డ్డారో మీకు అర్థ‌మ‌వుతుంది.

కాబ‌ట్టి, మీరు గ‌న‌క ఇందులో ఫ్లాట్ల‌ను కొనాల‌ని భావిస్తే.. కేవ‌లం రేటు మాత్ర‌మే కాకుండా.. ఎంత క్వాలిటీగా క‌డ‌తార‌నే విష‌యాన్ని పూర్తిగా తెలుసుకున్నాకే మీరు తుది నిర్ణ‌యం తీసుకోండి. తీరా మీరు సొమ్మంతా క‌ట్టిన త‌ర్వాత‌.. కాంక్రీటు నిర్మాణం జ‌రిగాక‌.. ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా.. వాటిని ప‌రిష్క‌రించ‌డం అంత సుల‌భం కాద‌నే విషయాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.

ఇదీ చదవండి: తెలంగాణలో కొత్త బిల్డింగ్ రూల్స్?