General

శ్రేయస్‌ అయ్యర్‌ రియల్‌ దూకుడు

శ్రేయస్‌ అయ్యర్‌ రియల్‌ దూకుడు

- ముంబైలో వరుస డీల్స్‌

 క్రికెట్ మైదానంలో సిక్సర్లు బాదే టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోనూ భారీ షాట్లు కొడుతున్నారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాలలో ఒకటైన వర్లిలో వరుసగా చేస్తున్న ప్రాపర్టీ కొనుగోళ్లు, అద్దె ఒప్పందాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఆయన కేవలం ఒక విలాసవంతమైన ఫ్లాట్ కోసం కుదుర్చుకున్న భారీ అద్దె ఒప్పందం చూసి పారిశ్రామిక ప్రముఖులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో శ్రేయస్ అయ్యర్ సృష్టించిన నాలుగు సంచలన డీల్స్ వివరాలివీ,,

  •  రూ.7.14 కోట్ల అద్దెకు విలాసవంతమైన అపార్ట్‌మెంట్

వర్లి ప్రాంతంలోని అత్యంత ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ అయిన ఆర్టేసియాలో ఒక భారీ అపార్ట్‌మెంట్‌ను శ్రేయస్‌ అద్దెకు తీసుకున్నారు. 3,875 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ లగ్జరీ ఫ్లాట్‌ను మూడేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకున్నారు. ఈ మూడేళ్లకు కలిపి శ్రేయస్ ఏకంగా రూ.7.14 కోట్టు అద్దె రూపంలో చెల్లించనున్నారు. ఈ ఫ్లాట్‌తో పాటు నాలుగు కార్ పార్కింగ్ స్లాట్లు కూడా లభించాయి. జూన్ 10, 2026న ఈ లీజ్ ఒప్పందం రిజిస్టర్ కాగా.. కేవలం స్టాంప్ డ్యూటీ కోసమే రూ.1.84 లక్షలు చెల్లించారు.

  •  తల్లితో కలిసి రూ.2.90 కోట్లతో మరో ఇల్లు

సెప్టెంబర్ 2024లో శ్రేయస్ అయ్యర్ తన తల్లి రోహిణి అయ్యర్‌తో కలిసి వర్లిలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఉన్న త్రివేణి ఇండస్ట్రియల్ సీహెచ్ఎస్ఎల్లో ఒక రెసిడెన్షియల్‌ ప్రాపర్టీని కొన్నారు. 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఫ్లాట్ కోసం వారు రూ.2.90 కోట్లు వెచ్చించారు. అంటే ఇక్కడ చదరపు అడుగు ధర దాదాపు రూ.55,238 గా పలికింది.

  •  కమర్షియల్ ప్రాపర్టీపై పెట్టుబడి

కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా భవిష్యత్తు ఆదాయం కోసం కమర్షియల్ స్పేస్‌పై కూడా శ్రేయస్ దృష్టిసారించారు. జూలై 2024లో వర్లి ఆదర్శ్ నగర్‌లోని గోదావరి ఇండస్ట్రియల్ సీహెచ్ఎస్ఎల్ బిల్డింగ్‌లో 510 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఒక కమర్షియల్‌ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. దీని విలువ రూ.2.9 కోట్లు. చదరపు అడుగుకు రూ.56,863 చొప్పున ఈ డీల్ కుదిరింది.

  •  రూ.12 కోట్లతో ఐకానిక్ ‘వరల్డ్ టవర్స్’లో ప్లాట్!

రియల్ ఎస్టేట్ రంగంలో శ్రేయస్ అయ్యర్ చేసిన మొదటి పెద్ద బ్లాక్‌బస్టర్ డీల్ ఇది. సెప్టెంబర్ 2020లో ముంబైలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కైస్క్రాపర్ బిల్డింగ్ ది వరల్డ్ టవర్స్లో లోధా డెవలపర్స్ నుంచి ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. 2,380 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఈ లగ్జరీ ఫ్లాట్ ధర అప్పట్లోనే ఏకంగా రూ.12 కోట్లు దీనితో పాటు 3 కార్ పార్కింగ్ ఏరియాలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా శ్రేయస్ అయ్యర్ ముంబైలోని వర్లి ప్రాంతాన్ని తన ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. క్రికెట్ కెరీర్‌లో దూసుకుపోతూనే, అటు బిజినెస్ మైండ్‌తో రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను కోట్లాది రూపాయలతో పటిష్టం చేసుకుంటూ తోటి క్రికెటర్లకు శ్రేయస్ సరికొత్త ఆదర్శంగా నిలుస్తున్నారు.